* దంపతులతో బేటి జరిపిన బీజేపీ అగ్రనేతలు
* పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వనం
* సముచిత స్థానం కల్పించేందుకు నేతల హమీ
* సానుకూలంగా స్పందించిన జడ్పీ మాజీ చైర్పర్సన్ దంపతులు
నిర్మల్ (శ్రీకరం న్యూస్) ; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ చైర్ పర్సన్ వి. శోభ, బీఅర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణ గౌడ్ దంపతులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఒకటి, రెండు రోజుల్లో దంపతులిరువురు కాషాయ కండువా కప్పుకోనున్నట్లుగా సమాచారం. బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎ. మ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ లోక్ సభ పార్టీ అభ్యర్థి గెడం నగేష్, పార్టీ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్ లతో పాటు మరి కొంత మంది అగ్రనేతలు శనివారం నిర్మల్ లో జడ్పీ మాజీ చైర్పర్సన్ దంపతులతో బేటి అయ్యారు. ఉదయం వేళలో వీరంతా జడ్పీ మాజీ చైర్ పర్సన్ దంపతుల నివాస గృహానికి వెళ్లి వారిద్దరితో గంటకు పైగా చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పలు రాజకీయ అంశాలపై బీజేపీ అగ్రనేతలు వారితో మాట్లాడారు. అనంతరం బీజేపీలో చేరాల్సిందిగా దంపతులిరువురిని వారందరూ అహ్వనించారు. పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు హమీనిచ్చినట్లుగా తెలిసింది. వారందరి ఆహ్వానం, విజ్ఞప్తి మేరకు జడ్పీ చైర్ పర్సన్ దంపతులు సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోనున్న తమ అనుచరగణం, అభిమానులతో జడ్పీ మాజీ చైర్ పర్సన్ దంపతులు సమావేశమై వారందరి అభిప్రాయాన్ని తెలుసుకొని ఒకటి రెండు రోజుల్లో బీఅర్ఎస్ పార్టీని వీడి దంపతులు బీజేపీలో చేరేందుకు కార్యచరణ ప్రణాళిక రూపోదించుకుంటున్నట్లుగా తెలిసింది. బేటి సందర్భంగా బీజేపీ శాసన సభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ నేతలు జడ్పీ మాజీ చైర్ పర్సన్ దంపతులను ఘనంగా సన్మానించగా, పార్టీ నేతలందరిని జడ్పీ మాజీ చైర్ పర్సన్ దంపతులు సన్మానించారు.