• ఉదయం 10 గంటల నుంచి స్తంభించిన రాకపోకలు
• కల్లూరు నుంచి కుంటాల మీదుగా వాహనాల దారి మల్లింపు
బైంసా, (శ్రీకరం న్యూస్) : దిలావర్ పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడి ప్రాంత వాసులు మంగళవారం రోడ్డెక్కారు. ఉదయం వేళ నుంచి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్ వ్యవస్థను స్తంభింపజేశారు. ఆందోళన కారుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు వాహనాలు నిలిచి పోయాయి. గత కొంత కాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న అక్కడి ప్రాంత వాసులు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. ఆందోళన కారులు ఉదయం 10 గంటల నుంచి జాతీయ రహదారి మార్గంలోనే బైటాయించి ఉన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు సముదాయిస్తున్నప్పటికి ఆం దోళన కారులు తగ్గేదేలే అన్న రీతిలో రాస్తారోకోను కొనసాగిస్తున్నారు.
*కల్లూరు మీదుగా వాహనాల దారి మళ్లింపు*
భైంసా- నిర్మల్ జాతీయ రహదారి మార్గంలోని దిలావర్పూర్ వద్ద ఉదయం నుంచి రాస్తారోకో కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే కుంటాల మండలం కల్లూరు నుంచి నిర్మల్ కు వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. కల్లూరు, కుంటాల, గొల్లమాడ మీదుగా సిర్గాపూర్ నుంచి నిర్మల్ వరకు వాహనాలను దారి మళ్లించి రాకపోకలు కొనసాగేల చర్యలు తీసుకున్నారు. అయితే భారీ వాహనాలు మాత్రం కల్లూరు నుంచి వానల్పాడ్ వరకు రోడ్డుకు ఒక వైపున నిలిచిపోయి ఉన్నాయి.