– నూతన సంవత్సర వేడుకల విందు కోసం చోరీ
– దొంగలిద్దరూ భైంసా మండలం చుచుంద్ వాసులు
– చోరీ చేసిన గుడి గంటల స్వాధీనం
– విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిలా
భైంసా ( శ్రీకరం న్యూస్) ; భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరి ఘటన కేసు 48 గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ గోపినాథ్ లు సంబంధిత చోరి ఘటన చేధించేందుకు గాను ప్రతిష్ఠాత్మకంగా వ్యవహారించి సత్ఫలితాలు సాధించారు. గురువారం ఉదయం భైంసాలోని ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిలా చోరి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన విశాల్, సంఘ రతన్ అనే ఇద్దరు స్నేహితులు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గాను డబ్బులు లేకపోవడంతో చోరి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిర తాళం పగులగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరి చేశారు. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసిన భైంసా పట్టణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా వ్యవహారించి దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులకు ఆలయంలోని పసుపు, కుంకుమ అంటుకుంది. అంతే కాకుండా చోరి జరిగిన సమయంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో పట్టణ ప్రవేశ మార్గంలోని సీసీ కెమెరాలన్నింటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలో చోరికి పాల్పడ్డిన ఇద్దరిలో ఒకరికి పసుపు, కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడి భావించి విచారణ చేపట్టారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ఇద్దరు చోరికి పాల్పడ్డట్లుగా నిర్ధారించి గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 48 గంటల వ్యవధిలో కేసును చేధించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గోపినాథ్ తో పాటు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకీ షర్మిలా అభినందించారు.