– ఫ్రీజర్ కోసం పిప్రి కాలనీకు వెలుతుండగా గుండెపోటు
– ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి
– ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అంత్యక్రియల సేవలు
– ఆత్మీయ పిలుపుకు.. ఆప్యాయత పలుకరింపుకు మారుపేరు విఠలన్న
బైంసా , ఏప్రిల్ 18 (శ్రీకరం న్యూస్) : ముధోల్ నియోజక వర్గ పరిధిలో వైకుంఠ రథ్ డ్రైవర్ అంత్యక్రియల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పురస్తు విఠలన్న (70) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఎనిమిదిన్నర సంవత్సరాలకు పైగా కాలం నుంచి ఇక్కడి ప్రాంతంలో రాత్రనక, పగలనక మృతదేహల అంత్యక్రియల ప్రక్రియలో వైకుంఠ రథం డ్రైవర్ గా అలుపెరుగని రీతిలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్నాడు. శుక్రవారం సైతం ఒక మృతదేహన్ని భద్రపరచేందుకు గాను ఫ్రీజర్ సమకూర్చే నిమిత్తం ద్విచక్ర వాహనం పై భైంసా పట్టణంలోని పిప్రి కాలనీకు వెలుతుండగా గుండెపోటు బారిన పడ్డాడు. వాహనం నడుపుతుండగానే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి కిందకు ఒరిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన అక్కడి ప్రాంతవాసులు విషమ పరిస్థితికి చేరుకున్న విఠలన్నను హుటహూటిన ఇక్కడి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
ఆత్మీయతతో పిలుపు.. ఆప్యాయతతో పలుకరింపు…
విఠలన్నా అందరినీ ఆత్మీయతతో పిలుస్తూ.. ఆప్యాయతతో పలుకరించేవాడు. చిన్న, పెద్ద తేడా వయస్సుతో తేడా లేకుండా అందరితో కలుపుగోలుగా వ్యవహరించేవాడు. అందరిని కాక, మామ, బాపు, నాన్న, తమ్ముడు, అక్క, వదిన, అత్తమ్మ, చిన్నమ్మ అంటూ ప్రేమ పూరితంగా సంబోదిస్తూ పలుకరించేవాడు. ఇలా అందరితో ఆత్మీయతతో పలకరించే విఠలన్న మృతి పట్ల అందరూ నివాళులు అర్పిస్తున్నారు.
అందరిచే మన్నననలు…
వైకుంఠ రథ్ వాహన డ్రైవర్ గా ఇక్కడి ప్రాంతవాసులందరిచే విఠలన్న మన్ననలు పొందాడు. బైంసా డివిజన్ పరిధిలో తొలిసారిగా మనిష్ ఇండస్ట్రీస్ వారు అంత్యక్రియలకు సేవలు అందించేందుగాను 2017లో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే ఆర్టీసీ డ్రైవర్ గా పదవీ విరమణ పొందిన పురస్తు విఠలన్న సంబంధిత వైకుంఠ రథానికి డ్రైవర్ గా చేరాడు. అప్పటి నుంచి మృతి చెందిన నేటి వరకు అదే వాహనానికి డ్రైవర్గా సేవలు అందిస్తూ అంత్యక్రియలు ప్రక్రియలో భాధ్యతాయుత భాగస్వామ్యాన్ని అందించారు. ఎక్కడి నుంచైనా, ఏ సమయానికైనా ఫోన్ కాల్ వచ్చిన స్పందించి అంత్యక్రియల కోసం వైకుంఠ రథం ద్వార ఎక్కడి చెప్పిన సమయానికి చేరుకునే వాడు, సమయ పాలన పాటించడంలో, డ్రైవర్ గా విధులు నిర్వహించడంలో నిబద్దతకు మారుపేరుగా నిలిచాడు. ఇలా విశిష్ట సేవలు అందించడం ద్వారా ముధోల్ నియోజక వర్గ ప్రజలందరికి సుపరిచుతడయ్యాడు.
– అన్ని ప్రాంతాల్లోనూ విఠలన్న మృతిపై విచారం…
ఎనిమిదిన్న సంవత్సరాలకు పైగా కాలం నుంచి అంత్యక్రియల సేవల్లో పాలుపంచుకుంటున్న విఠలన్న మృతిపై నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ విచారం వ్యక్తం అవుతోంది. ఇక్కడి ప్రతి గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో విఠలన్న వైకుంఠ రథం డ్రైవర్ గా సేవలు అందించాడు. తద్వారా అందరికి అర్హుడయ్యాడు. ఇలాంటి వ్యక్తి మృతి చెందడం పట్ల అంతటా అందరూ సంతాపం వెలిబుచ్చుతున్నారు.
.