* పత్తి విత్తనాలు విత్తుతుండగా దాడి చేసిన తేనెటీగలు
* తానూర్ మండలంలోని ఝారీ తండాలో ఘటన
* బాధితులను చికిత్స కోసం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు
భైంసా (శ్రీకరం న్యూస్) : వ్యవసాయ క్షేత్రంలో పత్తి విత్తనాలు విత్తుతున్న రైతులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన తానూర్ మండలంలోని ఝరీ తాండలో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే రైతు వ్యవసాయ భూమిలో అక్కడి ప్రాంత రైతులు, కూలీలు పత్తివిత్తనాలను విత్తే చర్యలు చేపట్టారు. ఈక్రమంలో అక్కడి ప్రాంతంలో ఆటలాడుకుంటున్న చిన్నారులు బంతి విసరడంతో అక్కడి చెట్టుపై ఉన్న తేనెతుట్టకు తగిలింది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా పత్తి విత్తనాలు విత్తుతున్న రైతులపై దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు గాను రైతులు పరిగెత్తారు. అప్పటికే ఎనిమిది మందికిపై గా రైతులపై తేనెటీగలు దాడి చేయడంతో వారందరు అస్వస్థకు చేరారు. బాధితులను 108 అంబులెన్సులో వైద్య సేవల నిమిత్తం భైంసా ఏరియాసుపత్రికి తరలించారు.