– మృతులంతా హైదరాబాద్ దిల్ షూక్ నగర్ ప్రాంతానికి చెందిన వారు
– పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్లి నీట మునిగి మృతి
– మృతులంతా 25 ఏళ్ల లోపు వారే…
భైంసా (శ్రీకరం న్యూస్)
చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ చింతల్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం, మిత్రుల బృందం బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. రైలులో వచ్చిన వీరంతా నేరుగా గోదావరి నదికి వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గమనించిన మిత్రులు ఈతగాళ్ల సహాయంతో వారిని బయటకు తీసి హుటాహుటిన భైంసా ఏరియా హాస్పిటల్కు తీసుకవచ్చారు. ఇక్కడ వైద్యుల బృందం, సిబ్బంది వీరికి ముందుగా సీపీఆర్ చేశారు. అయితే అప్పటికే రితీక్ (22), రాకేష్ (23), వినోద్ (21), మదన్ (22), భరత్ (21)లు మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా, మృతులంతా ఒకే కుటుంబీకులే. ఈ విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముథోల్ సీఐ మల్లేష్ లు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. ఘటనకు గల కారణాలను వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని పూర్తి వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.