– నా బార్డు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పది సోసైటీలు ఎంపిక
– ఉమ్మడి జిల్లా నుంచి హంగిర్గా సోసైటీకి దక్కిన స్థానం
– మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన చైర్మన్, సీఈవో
భైంసా (శ్రీకరం న్యూస్ ) ; రాష్ట్ర స్థాయి ఉత్తమ సహకార సంఘంగా జిల్లాలోని తానూర్ మండల పరిధిలో గల హంగిర్గా ప్రాథమిక సహకార సంఘం ఎంపికైంది. సహకార సంఘం ఆధ్వర్యంలో రుణాల మంజూరీ, వసూళ్లు, సంఘ నిర్వాహణ వ్యవస్థ తదితర అంశాలన్నింటిలో హంగిర్గా సహకార సంఘం మెరుగైన పని తీరును కనబర్చడం మూలంగా రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ సహకార సంఘంగా ఎంపికైంది. నాబార్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 10 సహకార సంఘాలు ఉత్తమ అవార్డు కోసం ఎంపికవ్వగా, ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి నుంచి హంగిర్గా సహకార సంఘం ఎంపికవడం గమనర్హాం. మంగళవారం హైదరాబాద్ లో నాబార్డు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఉత్తమ సహకార సంఘాలుగా ఎంపికైన 10 సోసైటీ చైర్మన్లు, సీఈవోలకు అవార్డులతో పాటు ప్రశంస పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఇందులో భాగంగానే హంగిర్గా సహకార సంఘ చైర్మన్ నారాయణ్ రావు పటేల్, సీఈవో బాజనోల్ల భూమయ్య లు మంత్రి నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ఉత్తమ సహకార సంఘ అవార్డు, ప్రశంస పత్ర పురస్కారాన్ని అందుకున్నారు.