– సికింద్రాబాద్ కంటోన్మెంట్లో హెల్త్ సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న భైంసా వాసి ఎం. దేవేందర్
– 2024-25 జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ ఎంపికైన కంటోన్మెంట్
– కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
భైంసా, (శ్రీకరం న్యూస్):
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసావాసి ఒకరిని జాతీయ స్థాయి స్వచ్చ సర్వేక్షణ్ అవార్డు వరించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో హెల్త్ సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న స్థానిక పులేనగర్ (లింబా (కె)కు చెందిన ఎం. దేవేందర్ సంబంధిత అవార్డు అందుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జాతీయ స్థాయిలో మినిస్టీరియల్ విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–-25 అవార్డుకు ఎంపికయ్యింది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బోర్డు సీఈవో మధుకర్ నాయక్, జాయింట్ సీఈవో పల్లవి విజయవంశీ, నామినేటేడ్ సభ్యురాలు భానుక నర్మదతో కూడిన బృందంతో కలిసి హెల్త్ సూపరిండెంట్ ఎం. దేవేంద్ లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ హెల్త్ సూపరిండెంట్ ఎం. దేవేందర్ మాట్లాడుతూ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ బోర్డు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచిందన్నారు. శుభ్రత, పరిశుభద్రత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధిత విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. ఇదే క్రమంలో సేవాస్థాయి పురోగతి, వాహనాల నిర్వహణ, పారి శుద్య నిర్వాహణ తదితర అంశాలు స్వచ్చ సర్వేక్షణ్ అవార్డు ఎంపిక ప్రక్రియలో ప్రధాన భూమిక పోషించాయని వివరించారు. బోర్డు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉండటం, చైతన్య కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వడం, స్వచ్చ యాప్ వినియోగించడం తదితర అంశాలు జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపిక కావడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. బోర్డు పరిధిలోని ప్రజల తోడ్పాటు, సహాకారం, ఐఖ్యత, భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషించాయని వెల్లడించారు. అందరి సహాకారం, సమిష్టి కృషితో అవార్డు వరించిందని తెలిపారు.