– భైక్–ఆటో ఢీ కొట్టుకోవడంతో ఘటన
– భైంసాలోని రాహుల్ నగర్ కు చెందిన యువ ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం
భైంసా (శ్రీకరం న్యూస్) ;
భైంసా–బాసర రహదారిలోని దేగాం గ్రామ పరిసర ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేగాం రోడ్డు మరో వ్యక్తిని కబలించింది. ఇక్కడి ప్రాంతంలో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలతో ఇటీవలనే ఐదుగురికి పైగా మృత్యువాత పడగా, పది మందికి పైగా తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్సలు పోందుతున్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ నుంచి భైంసా వైపు తన ద్విచక్రవాహానంపై వస్తున్న గర్కే ప్రవీణ్ (32), భైంసా నుంచి బాసర వైపు వెళ్తున్న ఆటో దేగాం–సరస్వతీ మార్గ మధ్యంలో ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా గర్కే ప్రవీణ్ ఘటన స్థలిలోనే దుర్మరణం పాలయ్యాడు. కుభీర్ మండలంలోని గోడాపూర్ గ్రామానికి చెందిన గర్కే ప్రవీణ్ భైంసాలో నివాసముంటూ ప్రైవేటు ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. మృతుడు ప్రవీణ్ కు భార్యతో పాటు ఏడు సంవత్సరాలలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భైంసా రూరల్ ఎస్సై శంకర్ తెలిపారు.