– నిర్మల్ శ్రీనగర్ కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిలా
భైంసా (శ్రీకరం న్యూస్ ; ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానమని, నేర నిరోధంలో, నేరస్థుల పట్టివేతలో సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోశిస్తాయని జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిలా అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీవాసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కాలనీ అధ్యక్షులు బానుచందర్ తో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాలనీవాసులు పోలీసు శాఖకు సహకరించే రీతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల వాసుల సహకారంతో 10వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటన్నింటినీ జియో ట్యాగింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘాను కట్టుదిట్టం చేసి చోరీల నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. అన్నీ ప్రాంతాల వాసులు తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలు తగ్గుముఖం పడుతాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ గాంజా గస్తీ కార్యక్రమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా గంజాయి అమ్మకాలు, సేవించడం కంట పడితే పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్ కాలనీవాసులు అధ్యక్షుడు బానుచందర్ నేతృత్వంలో ఒకే పర్యాయం కాలనీలోని అన్నీ ప్రాంతాలను కలుపుతు 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని కొనియడారు. ఇదే స్పూర్తిని అన్నీ ప్రాంతాల వాసులు తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను బిగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు బాను చందర్ జిల్లా ఎస్పీ నేతృత్వంలో రాష్ట్రంలో ఎక్కడ లేని రీతిలో జిల్లాలో కొనసాగుతున్న వినూత్న కార్యక్రమాలు పోలీసు అక్క, నారీ శక్తి, శివంగి, మిషన్ గాంజా గస్తీ వంటి కార్యక్రమాలు పకడ్బందీగా కొనసాగుతు సత్ఫలితాలు ఇస్తున్నాయని కొనియడారు. ఇందులో భాగంగా శ్రీనగర్ కాలనీవాసులు సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకీ షర్మిలా, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు సంజీవ్, సందీప్, అజయ్, మహిళా ఎస్సై శ్రావణిలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు.