– నష్ట నివారణ చర్యలపై రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగాలకు దిశానిర్దేశం
– అప్రమత్తంగా అధికార యంత్రాంగం
భైంసా (శ్రీకరం న్యూస్ ) ; ఎడతెరిపి లేని భారీ వర్షాల మూలంగా భైంసా మున్సిపల్ కేంద్ర పరిధిలో ఎలాంటి నష్టాలకు తావు లేకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. శనివారం సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ రెవెన్యూ, మున్సిపల్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టారు. ముందుగా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు చేరుకుని అక్కడి పరిస్థితిపై ప్రాజెక్టు నిర్వాహణ అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక, సుద్దవాగులోకి నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. అన్నీ వేళలా అప్రమత్తతో వ్యవహారించి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. అక్కడి నుంచి మున్సిపల్ కమిషనర్ రాజేష్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ లతో కలిసి ముంపు బెడద పొంచి ఉన్న ప్రాంతమైన రాహుల్ నగర్ లో పర్యటించారు. అక్కడి ప్రాంతంలో వర్షాల మూలంగా నిలుస్తున్న నీటిని ఎక్కడిక్కడ తరలిపోయేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రోడ్లపై నీరు నిల్వ కుండా ఉండేలా చూడాలని ఆదేశించారు. ముంపు వాటిల్లకుండా ముందస్తు నష్ట నివారణ చర్యలు సత్వరంగా చేపట్టాలని పేర్కొన్నారు. అన్నీ శాఖల అధికారులు స్థానికంగా ఉంటూ వరదల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా సమన్వయంతో వ్యవహారిస్తూ చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ వెల్లడించారు.