– సుద్దవాగులోకి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల
– ప్రాజెక్టులోకి 6500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
భైంసా (శ్రీకరం న్యూస్) ; భారీ వర్షాల మూలంగా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇంతకింతకీ పెరుగుతున్న వరద నీటి చేరికతో ప్రాజెక్టు నిర్వాహణ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహారిస్తోంది. ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటికి అనుగుణంగా సుద్దవాగులోకి ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి వదిలి పెడుతున్నారు. శనివారం ఉదయం నుంచి 5వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, మధ్యాహ్నాం సమయానికి 6500కు పెరిగింది. దీంతో ఉదయం వేళలో 2 వరద గేట్లను ఎత్తి సుద్దవాగులోకి 4571 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు తదనంతరం వరద నీటి చేరిక పెరిగిన నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన 3 వరద గేట్లను ఎత్తి సుద్దవాగులోకి 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అధిక మొత్తంలో వరద నీరు సుద్దవాగులోకి వదిలి పెడుతున్న నేపథ్యంలో సుద్దవాగు నదీ పరివాహాక ప్రాంతమంతా జలమయమవుతుంది.