– 10,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
– 20వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో
– సుద్దవాగు పరివాహాకంలో పొంచి ఉన్న వరద ముప్పు
భైంసా (శ్రీకరం న్యూస్) ; వరుణుడి జోరు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి వేళ ప్రారంభమైన వర్షం ఇంకా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద నీరు అధిక మొత్తంలో వచ్చి చేరుతుంది. ఉదయం వేళ నుంచి క్రమక్రమంగా చేరిన వరద నీరు మధ్యాహ్నాం 2.30గంటల ప్రాంతానికి 10500 క్యూసెక్కులకు చేరుకుంది. వరద నీటి చేరికకు అనుగుణంగా ఉదయం వేళలో 2 గేట్లు, అనంతరం 3 గేట్లు, మధ్యాహ్నాం వేళ నుంచి స్వల్ప వ్యవధిలోనే 4, 5 వరద గేట్లను ఎత్తారు. ప్రస్తుతం గడ్డెన్న ప్రాజెక్టులోకి 10500 క్యూసెక్కుల ఇన్ ఫ్లొ ఉండగా, 20 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 358.4 మీటర్లకు చేరుకుంది. ఇక నీటి నిల్వల విషయానికి వస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1.83 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 1.658 టీఎంసీలుగా ఉంది. గడ్డెన్న ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి సుద్దవాగులోకి 20వేల క్యూసెక్కుల నీటిని వదిలి వేయడంతో పరివాహాక ప్రాంతమంతా జలమయమైంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా సుద్దవాగు పరివాహాక ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉంది. సుద్దవాగును అనుకొని ఉన్న పంట చేలలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడం మూలంగా పంట పైర్లు దెబ్బతింటున్నాయి.