– బైపాస్ రోడ్డు వంతెనను ముంచెత్తిన గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వరద నీరు
– బైపాస్ రోడ్డు మార్గములోని వ్యాపారస్తులను అప్రమత్తం చేసిన పోలీసులు
బైంసా (శ్రీకరం న్యూస్ ): గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ వరద నీటితో ముంపు ప్రభావం మొదలైంది. సోమవారం ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు వరద గేట్లను ఎత్తివేసి సుద్ధ వాగులోకి 13 వేల క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టింది. ఈ క్రమంలో సుద్ధ వాగు పొంగి పొర్లుతూ ఉదృతితో ప్రవహిస్తోంది. ఇందులో భాగంగానే గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ వరద నీరు సుద్ద వాగు బైపాస్ రోడ్డు వంతెనను ముంచెత్తింది.ప్రాజెక్టు వరద నీరు సుద్ద వాగు బైపాస్ రోడ్డు వంతెన మీదుగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది . బైపాస్ రోడ్డు సైతం జలమయమైంది. దీంతో పోలీసు అధికారులు సుద్ధ వాగు బైపాస్ రోడ్డు మార్గం మీదుగా రాకపోకలను నిలిపివేశారు. భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ నేతృత్వములోని పోలీసు సిబ్బంది సుద్దవాగు బైపాస్ రోడ్ వంతెనకు ఇరువైపులా భద్రతా చర్యలు చేపట్టి రాకపోకలను స్తంభింప చేశారు. ఇదే క్రమంలో బైపాస్ రోడ్డు మార్గంలోని వ్యాపార సంస్థలకు, కల్యాణ మండపాల నిర్వాహకులకు పోలీసు అధికారులు ముంపు ప్రమాద విషయాన్ని వివరించి అప్రమత్తం చేశారు బైపాస్ రోడ్డు వంతెనను అనుకొని వ్యాపారం నిర్వహిస్తున్న వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.