– ఆరు సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహం ప్రతిష్టాపణ
– ఆదర్శంగా చవితి వేడుకల నిర్వహణ
బైంసా, (శ్రీకరం న్యూస్): రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బైంసాలోని ఆర్యవైశ్య మండలి వినాయక చవితి వేడుకల నిర్వా హణలో జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ హితమే తమ అభిమతంగా సంఘ శ్రేణులు గత ఆరు సంవత్స రాలుగా చవితి వేడుకల్లో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ మార్గదర్శకంగా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిర క్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసే విగ్రహాల మూలంగా జరిగే అనర్థాలను తెలుసుకున్న సంఘ ప్రతినిధులు మట్టి విగ్రహం వైపు దృష్టి సారించారు. సంఘ శ్రేణులు కూడా ఇందుకు మద్దతుగా నిలువడంతో ఆరు సంవత్సరాలుగా ఇక్కడి ఆర్యవైశ్య మండలి మట్టి వినాయక విగ్రహ ప్రతిష్టాపనను కొనసాగిస్తు న్నారు. బుధవారం సైతం మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి వేడుకలకు శ్రీకారం చుట్టారు.
– మార్గదర్శకంగా నిలుస్తున్న ఆర్యవైశ్య మండలి…
చవితి వేడుకల నిర్వహణలో అదికంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారు చేయబడిన వినాయక విగ్రహాల ప్రతిష్టాపన కొనసాగుతోంది. పోటాపోటీగా ఒక సంఘాన్ని మించి మరో సంఘం పెద్దపెద్ద సైజులలో విభిన్న రూపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా భైంసా ఆర్యవైశ్య మండలి వ్యవహరిస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ మార్గదర్శకంగా నిలుస్తోంది. వినాయకుని పై భక్తి, పర్యావరణ పరిరక్షణకు రెండు కలగలిపి వేడుక నిర్వహించడం సమాజానికి మేలని భావించి మట్టి విగ్రహ ప్రతిష్టాపన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆర్యవైశ్య మండలి ప్రతినిధుల బృందం వెల్లడించింది.