– వరద నీటితో నిండుకపోయిన ఆలయ పరిసరాలు
– మోకాలిలోతు పై బాగం వరకు నిలిచిన నీరు
– దర్శనం కోసం పడరాని పాట్లు పడుతున్న భక్తజనం
– అవస్థలు పడుతున్న వ్యాపారులు
బైంసా, (శ్రీకరం న్యూస్): జోరు వానలతో భక్తజనం ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రంలోని పాలజ్ గణేష్ మందిరం జలమయమమయ్యింది. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ వరద నీటితో నిండుకపోయాయి. మోకాలిలోతు కంటే పై బాగంలో వరద నీరు నిలిచిపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దర్శనం కోసం వేళ్లేందుకు గాను పడరాని పాట్లు పడుతున్నారు. శుక్రవారం వేకువ జాము వేళలో పాలజ్ తో పాటు అక్కడి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆలయానికి ఎగువ భాగంలోనున్న కీని గుట్ట ప్రాంతం నుంచి వర్షపు నీరు ఉదృతితో పాలజ్ వైపు ప్రవహించింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతంగానున్న పాలజ్ గణేష్ మందిరం వైపు అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. వరద నీరు ఆలయ పరిసరాలన్నీంటిని ముంచెత్తింది. ఆలయ ప్రవేశ మార్గంతో పాటు ఇతర ప్రాంతాలన్నీ మోకాలిలోతు కంటే పై భాగంలో వదర నీరు నిలిచింది. దీంతో ఆలయంలోకి వెళ్లి పాలజ్ గణేషుని దర్శనం కోసం భక్తజనం పడుతున్న తిప్పలు వర్ణణాతీతంగా ఉన్నాయి. పిల్ల,పాపలు, వృద్ధులతో వచ్చిన భక్తులు ఆగచాట్ల పాలవుతున్నారు. ఇక అక్కడి వ్యాపారస్తులు తమ విక్రయ సామాగ్రి తడిసిపోకుండా,వరద నీటి ప్రవహంలో కొట్టుకపోకుండా కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.