– 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
– 37 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో
– సుద్దవాగు పరివాహాక ప్రాంతాన్నీ ముంచేత్తనున్న వరద నీరు
భైంసా (శ్రీకరం న్యూస్) ; మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీ వరద నీటి ప్రవాహాం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు సంబంధించిన 8 వరద గేట్లలో ఐదు వరద గేట్లను ఎత్తివేసి దిగువన ఉన్న సుద్దవాగులోకి 37వేల క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. ఉదయం 4గంటల నుంచి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో క్రమక్రమంగా పెరుగుతు 5వేల క్యూసెక్కుల నుండి ఉదయం 9.30గంటల ప్రాంతానికి 30వేల క్యూసెక్కులకు ఏగబాకింది. ఈ క్రమంలో ఇన్ ఫ్లోకు అనుగుణంగా వరద గేట్లను క్రమక్రమంగా ఎత్తివేస్తూ సుద్దవాగులోకి వరద నీటిని వదిలిపెట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, ఐదు వరద గేట్ల ద్వారా 37వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో జరుగుతుంది. సుద్దవాగులోకి 37వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో పరివాహాక ప్రాంతాలన్నీ ముంపు బారిన పడే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సుద్దవాగు శివాలయం, భైపాస్ రోడ్డు వంతెన, హిందూ స్మశాన వాటిక, డిపో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా 29వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నుంచి 37వేల క్యూసెక్కులకు ఔట్ ఫ్లో పెరిగిన నేపథ్యంలో మరిన్ని ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితులు ఉన్నాయి. సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గోపినాథ్, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, తహసీల్దార్ ప్రవీణ్ లు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచన వేస్తూ అప్రమత్తతో వ్యవహారిస్తున్నారు. అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరద మూలంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందసుత పకడ్బందీ చర్యలు చేపట్టారు.