– ముంపులో పలు లాడ్జీలు, వ్యాపార సంస్థలు
– ట్రాక్టర్‌పై వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
– ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు
భైంసా (శ్రీకరం న్యూస్ ) బాసరలో గోదావరి నది ఉధృతి పెరగడంతో తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి నీరు ఎగసిపడడంతో పలు లాడ్జీలు, వ్యాపార సంస్థలు జలమయం కాగా, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్వయంగా ట్రాక్టర్‌పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు పరిస్థితులను సమీక్షించి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికార యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ఎస్పీ భరోసా ఇచ్చారు. రక్షణ చర్యల్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు భాగస్వామ్యమై సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు.