– ఐదు వరద గేట్ల ద్వారా కొనసాగుతున్న 37 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో
– ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు
– ప్రస్తుత నీటి మట్టం 358.3 మీటర్లు
బైంసా, (శ్రీకరం న్యూస్):
మహారాష్ట్రలో వర్షపు జోరు తగ్గిన నేపథ్యంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గుముఖం ప ట్టింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రాజెక్టులోకి 43 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా సాయంత్రం 6 గంటల సమయానికి ఇన్ ఫ్లో 20 వేల క్యూసెక్కుల తగ్గిపోయింది. మధ్యాహ్నం వేళలో ఇన్ ఫ్లో కు ఆధారంగా ప్రాజెక్టు నిర్వాహణాధికారులు ఐదు వరద గేట్ల ద్వారా దిగువన ఉన్న సుద్దవాగులోకి 37 వేల క్యూసెక్కుల వరద నీటిని వదిలివేసారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు ఉండగా మధ్యాహ్నం వేళలో ప్రాజెక్టు నీటి మట్టం 358.65 గా ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఐదు వరద గేట్ల ద్వారా 37 వేల క్యూసెక్కుల వరద నీటి వదిలివేత కొనసాగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళలో 358.65 మీటర్లుగానున్న నీటి మట్టం సాయంత్రం 6 గంటల సమయానికి 358.3 మీటర్లకు తగ్గింది. అయితే సాయంత్రం 6 గంటల సమయానికి ఇన్ ఫ్లో 20 వేల క్యూసెక్కులకు, నీటి మట్టం 358.3 మీటర్లకు తగ్గినప్పటికి ఐదు వరద గేట్ల ద్వారా 37 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో యదావిధిగా కొనసాగింది. సుద్దవాగు పరివాహక ప్రాంతాలన్నీ ఇప్పటికీ జలమయంలో నే కొనసాగుతున్నాయి.