– హైదరాబాద్ లో చికిత్స పోందుతూ మృతి
– మున్సిపల్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గా ఎనలేని సేవలు
– మచ్చలేని మహోన్నత వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు
– సరస్వతీ శిశు మందిర్ ల అభివృద్ధికి విశేష కృషి
– భైంసాలో రేపు మధ్యాహ్నాం 3గంటలకు అంత్యక్రియలు
భైంసా(శ్రీకరం న్యూస్) ;
ముథోల్ నియోజకవర్గ రాజకీయ కురువృద్ధుడు.. మచ్చలేని మహోన్నతి మూర్తిగా.. రాజకీయ నాయకుడిగా.. ప్రజాప్రతినిధిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డీసీసీ మాజీ అధ్యక్షులు మాశెట్టి వార్ దిగంబర్ శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని ఒక రిహాబిటేషన్ సెంటర్ లో చికిత్స పోందుతు మృతి చెందారు. మాశెట్టి వార్ దిగంబర్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం 3గంటలకు భైంసాలో జరుగనున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాశెట్టివార్ దిగంబర్ స్వర్గీయ మాజీ మంత్రివర్యులు గడ్డెన్నకు ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా దశాబ్ద కాలానికి పైగా సేవలందించారు. భైంసా ప్రాంత వాసులందరికీ సుపరిచితులైన ఆయన రాజకీయంగా, సామాజికంగా, వ్యాపార పరంగా ఎన్నో సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ దిగంబర్ మాశెట్టివార్ సేవలను గుర్తించి ఆయనకు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పదవీని కట్టబెట్టింది. అంతే కాకుండా రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్ మాశెట్టివార్ దిగంబర్ ఎన్నికై భైంసా పట్టణ అభివృద్ధికి విశేష కృషి గావించారు. ఇటు రాజకీయ పరంగానే కాకుండా మాశెట్టివార్ దిగంబర్ సామాజిక పరంగా ఎన్నో సేవలు అందించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల స్థాపనకు, అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. భైంసా పూలేనగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు కోట్లాది రూపాయల విలువైన భూమిని ఉచితంగా అందించారు. సంబంధిత పాఠశాలకు మాశెట్టివార్ కుటుంబ సభ్యుల పేరు మీద సుభధ్రవాటిక అని పేరు పెట్టారు. దీనికి తోడు భైంసా పట్టణంలో జిన్నింగ్, కమీషన్ ఏజెంట్ వ్యాపారంలో పలు సేవలందించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. తన వద్ద పని చేసే సిబ్బందికి, గుమాస్తాలకు కుటుంబ సభ్యుల వలే ఆదరించి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గా విధులు నిర్వహించిన ఆయన ఎలాంటి మచ్చలేని నాయకునిగా పేరొందారు. తన పదవీ కాలంలో అవినీతికి అస్కారం లేకుండా పాలన కొనసాగించి ఆదర్శ నేతగా అందరిచే మన్ననలు పొందారు. భైంసా పట్టణంలోని అన్నీ రాజకీయ పార్టీల నాయకులచే కలిసి మెలిసి ఉండే ఆయన మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టణ వాసులందరూ ఆయన సేవలను గుర్తిస్తూ ఆవేదన చెందుతున్నారు.