• ఉదారతను చాటుకున్న బెల్తరోడా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు
బైంసా, (శ్రీకరం న్యూస్): తొలి ఉద్యోగ వేతనాన్ని బైంసాలోని నిరాశ్రిత బాలుర వివేకానంద అవాసానికి విరాళంగా అందించి నూతన ప్రభుత్వ ఉపాధ్యాయుడొకరు తన ఉదారతను చాటుకున్నాడు. బైంసా మండల పరిధిలోని కోతల్గావ్ గ్రామానికి చెందిన కూనేరి శేఖర్ (శంకర్) డీఎస్సీ 2024 ద్వారా అక్టోబర్ మాసంలో ఉద్యోగం సాధించారు. తానూర్ మండలంలోని బెల్తారోడా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యా యునిగా నియమితులయ్యారు. చిన్ననాటి నుంచి సేవా భావాలతో వ్యవహరించే కూనేరి శేఖర్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా తాను పొందిన తొలి వేతనాన్ని సేవ కోసమే వెచ్చించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తల్లితండ్రులు లేని నిరాశ్రిత బాలుర కోసం భైంసాలో నిర్వహింపబడుతున్న వివేకానంద అవాసానికి తన తొలి వేతనాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తన తల్లితండ్రులు కూనేరి లక్ష్మీ, ఈరన్నలతో కలిసి వెళ్లి అవాస కేంద్రాన్ని సందర్శించారు. అనం తరం తాను అందుకున్న తొలి వేతనాన్ని తల్లితండ్రులతో కలిసి అవాస నిర్వాహకుల కు అందచేశారు. .ఇందులో అర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘ్ చాలక్ సాధుల కృష్ణ దాస్,అవాస కమిటీ ప్రతినిధి రాజేశ్వర్, ప్రముఖ్ లింగారెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.