– మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణాలో ప్రవేశించిన యాత్రీకుల బస్సులు
– ఆదిలాబాద్, నిర్మల్ మీదుగా బైంసాకు రానున్న యాత్రీకులు
– స్వాగత ఏర్పాట్లు చేపట్టిన బీజేపీ శ్రేణులు
– ఉద్విగ్నతతో తమవారి కోసం ఎదురుచూపులు చూస్తున్న యాత్రీకుల కుటుంబీకులు
భైంసా , (శ్రీకరం న్యూస్) ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వృందావన్ క్షేత్రం నుంచి బుధవారం బయలుదేరిన కాశీ తీర్ధయాత్ర చేపట్టిన యాత్రీకుల బృందం మరో గంటన్నర కాల వ్యవధిలో బైంసాకు చేరుకోనున్నారు. యాత్రికుల బస్సులు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని నాగపూర్ మీదుగా ఆదిలాబాద్ ప్రాంతంలో తెలంగాణలోకి ప్రవేశించాయి. సంబందిత యాత్రీకుల ప్రయాణించిన బస్సు మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ క్షేత్రంలో అగ్నిప్రమాదం బారి న పడి దగ్ధమయ్యింది. దీంతో బస్సులో ప్రయాణించిన యాత్రీకులు కట్టుబట్టలతోనే మిగిలిపోయారు. వీరి పరిస్థితిని గుర్తించిన అక్కడి ప్రాంత పోలీసు, రెవెన్యూ అధికారులు, అర్ఎస్ఎస్ శ్రేణులు, వ్యాపార వర్తక సంఘాల శ్రేణులు స్పందించి అన్ని విదాలుగా వసతులు, సౌకర్యాలు కల్పించి అవసరమైన సహయ.సహకారాలు అందించారు. సంబందిత సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల లు అక్కడి పోలీసు, రెవెన్యూ అధికారులతో పలు పర్యాయాలు మాట్లాడి తమ ప్రాంతవాసులను సురక్షితంగా భైంసాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన అక్కడి అధికారులు 24 సీట్ల కెపాసిటీతో కూడిన యూప్ 85 ఈటి 4999, యూప్ 85 డిటీ 4888 నెంబర్లు గల రెండు టూరిస్టు బస్సు లను ఏర్పాటు చేసి యాత్రీకులను బైంసాకు తరలించే చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలు దేరిన యాత్రీకుల బస్సులు గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అదిలాబాద్ ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి నిర్మల్ మీదుగా యాత్రీకుల బస్సులు బైంసాకు మధ్యాహ్నం 3.30 గంటల తదుపరి చేరుకోనున్నాయి.
• ఉద్విగ్నతతో కుటుంబీకులు ఎదురు చూపులు
ప్రతికూల పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో యాత్రను మార్గమద్యంలో ముగించుకొని సురక్షితంగా తిరిగి వస్తున్న తమ వారి కోసం యాత్రీకుల కుటుంబ సభ్యులు ఉద్విగ్నతతో ఎదురు చూపులు చూస్తున్నారు. యాత్రీకుల బస్సు అగ్ని ప్రమాదం బారిన పడిన సమయం నుంచి యాత్రీకుల కుటుంబాల సభ్యులు ఆందోళనతో కాలం వెళ్లదిస్తున్నారు. తమ వారి యోగక్షేమాల కోసం పరితపించిన వారందరు యాత్రీకులు సురక్షితమైన స్థితిలో క్షేమంగా తిరిగి వస్తుండటంతో ఊరట చెందుతున్నారు.భైంసా లో యాత్రికులను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ సారధ్యములో బీజేపీ శ్రేణులు స్వాగతము పలికేందుకు ఏర్పాట్లు చేపట్టాయి.