– సంప్రదాయబద్ధంగా అమ్మవారి విగ్రహానికి శోభయాత్ర.
– భక్తుల కోలాహలం మద్యన ఆలయానికి చేరుకున్న అమ్మవారి విగ్రహం
– భక్త జనసంద్రంగా మారిన భట్టిగల్లి
భైంసా,(శ్రీకరం న్యూస్) ; మున్సిపల్ కేంద్రమైన భైంసాలోని భట్టిగల్లీలో శనివారం శ్రీ బదిపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కొనసాగమన్నాయి. ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా శనివారం పట్టణ పరిధిలోని మహాలక్ష్మీ మందిరం నుంచి అమ్మవారి విగ్రహాన్ని శ్రీ బద్దిపోచమ్మ ఆలయం వరకు శోభయాత్రగా తీసుకవెళ్లారు భట్టిగల్లి గణేష్ నగర్ కాలనీవాసులతో పాటు పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాలవాసులు అధిక సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు. వేయికి పైగా మంది మహిళ భక్తులు ముందుగా తమ తమ నివాస గృహాల నుంచి శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మహాలక్ష్మి మందిరానికి శోభయాత్రగా తరలివచ్చారు.ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి విగ్రహాన్ని శోభయమానంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై శ్రీ బద్దిపోచమ్మ ఆలయ వరకు శోభయాత్ర తీసుకవెళ్లారు. శోభయాత్ర ముందు వరుసలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు ఘోష్ నిర్వహిస్తూ అమ్మవారి విగ్రహానికి స్వాగత కార్యక్రమాలు చేపట్టారు. తదుపరి బట్టిగల్లి, గణేష్ నగర్ భజన మండలీలు భజనలు చేస్తూ కోలాటాలు వేస్తూ, నృత్యాలు చేపడుతూ శోభయాత్రలో పాల్గొన్నారు. ఇక మహిళమూర్తులు మంగళహరతులతో గేయాల ఆలపిస్తూ శోభయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శోభయాత్ర ఆధ్యాంతం భక్తుల కోలాహలం మధ్య సంప్రదాయ రీతిలో కొనసాగింది. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి పురస్కరించుకొని భట్టిగల్లి జనసంద్రంగా మారిపోయింది. అక్కడి ప్రాంత కాలనీవాసులందరూ అధిక సంఖ్యలో అమ్మవారి విగ్రహ శోభయాత్రకు తరలిరావడంతో భటి గల్లి పూర్తిస్థాయిలో జనసంద్రంగా మారిపోయింది. కాలనీ పరిధిలో ఎక్కడ చూసిన భక్తులతో నిండిపోయి కనిపించింది.