– సహకరించిన భార్య, వెండి వ్యాపారిపై కేసు నమోదు
– 3.1 కిలోల వెండి, మూడు మాసాల బంగారం స్వాధీనం
– వివరాలు వెల్లడించిన ఎస్పీ డా. జానకీ షర్మిలా
భైంసా (శ్రీకరం న్యూస్) ; మున్సిపల్ కేంద్రమైన భైంసాలోని పలు ఆలయాల్లో వరుస చోరిలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ ఆలయాల్లో చోరి చేసిన వెండి, బంగారు అభరణాలను సైతం స్వాధీనపర్చుకున్నారు. చోరికి సహకరించిన నిందితుడి భార్యతో పాటు చోరి సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం భైంసాలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిలా, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ గోపినాథ్, ఎస్సైలు శ్రీనివాస్ యాదవ్, గౌస్ అహ్మద్ లతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ శింఢే (36) అనే వ్యక్తి గత కొంత కాలంగా మహారాష్ట్రలోని నాందేడ్ బలరాంపూర్ లో నివాసముంటూ చోరిలకు పాల్పడుతున్నాడు. గత కొంత కాలంగా భైంసా పట్టణలోని నర్సింహా స్వామి ఆలయం, పూలే నగర్ హనుమాన్ మందిర్, సంతోషిమాత మందిర్, కైలాస్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ బాలాజీ దేవాలయంతో పాటు నిర్మల్ రోడ్డు మార్గంలోని హిమా వైన్స్లో వరుసగా చోరిలకు పాల్పడ్డాడు. ఎలాంటి ఆచూకి, ఆనవాళ్లు దొరకకుండా చాకచాక్యంగా చోరిలకు పాల్పడుతున్న దొంగను పట్టుకునేందుకు గాను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినిగియోంచి కేసును చేధించినట్లుగా తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో దొంగతనాలకు పాల్పడుతున్న విజయ్ శింఢేను గుర్తించి అదుపులోకి తీసుకొనగా.. భైంసాలో నాలుగు ఆలయాలతో పాటు హిమా వైన్స్లో చోరికి పాల్పడ్డట్టుగా అంగీకరించారు. దీంతో పోలీసులు అతనిని విచారించగా.. ఆలయాల్లో చోరి చేసిన వెండి, బంగారు అభరణాలను విక్రయించేందుకు గాను ఆయన భార్య పూజా శింఢే, మహారాష్ట్రకు చెందిన వెండి వ్యాపారి పాండురంగ్ రామారావు సహకరించినట్లుగా వెల్లడించారు. వారి వద్ద నుంచి చోరికి పాల్పడిన 3కిలోల 150 గ్రాముల వెండి సొత్తు, 3మాసాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చోరికి పాల్పడిన నిందితుడు విజయ్ శింఢేను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా ఎస్పీ జానకీ షర్మిలా వివరించారు. ఇదే ఘటనలో భాగస్వామ్య ఉన్న మిగతా ఇద్దరిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన కేసును భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంలో భైంసా టౌన్ సీఐ గోపినాథ్, ఎస్సై శ్రీనివాస్ యాదవ్ లు చాకచాక్యంగా వ్యవహారిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేధించడంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు. వీరితో పాటు ఇద్దరు మహిళా పోలీసులు, నలుగురు కానిస్టేబుళ్లు అవిరళంగా కృషి చేశారని, వారదందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.